Vijayawada Temple Rs 500 Darshan Tickets Cancel: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిస్తూ, VIP దర్శనాలను నియంత్రిస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. ఉచిత బస్సులు ఉండటంతో రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఉత్సవాల్లో రూ.500 టికెట్లను రద్దు చేశారు. మూలానక్షత్రం, విజయదశమి రోజుల్లో నిరంతరాయ దర్శనాలుంటాయి. కొత్త యాగశాల, పూజా మందిరాలు సిద్ధమయ్యాయని అధికారులు వెల్లడించారు.
విజయవాడ దుర్గ గుడిలో దసరా ఉత్సవాలు
అంతరాలయ దర్శనాలు లేవన్న మంత్రి
సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చేందుకు
విజయవాడ అంతరాలయ దర్శనాలు లేవు
విజయవాడలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది. సామాన్య భక్తులకు ప్రాధాన్యతనిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. దసరా ఉత్సవాలను ఇంద్రకీలాద్రిపై వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం నియమించిన మంత్రుల బృందం సమావేశమైంది. ఈ కమిటీలో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్, పార్థసారథి, కొల్లు రవీంద్ర ఉన్నారు. ఈ ఏడాది దసరాకు భారీగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. గతేడాది 13 లక్షల మంది వచ్చారు. ఉచిత బస్సులు ఉండటంతో ఈసారి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సామాన్య భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. VIP, VVIP దర్శనాలను నియంత్రిస్తామన్నారు మమంత్రి ఆనం.
అమ్మవారి దర్శనం, తీర్థప్రసాదాలు, అన్నప్రసాదం అన్నీ సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇస్తామన్నారు మంత్రి. VIP భక్తులకు ఉదయం 7-9 గంటల మధ్య, మధ్యాహ్నం 3-5 గంటల మధ్య మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. కేవలం ఆ సమయంలోనే ప్రొటోకాల్ దర్శనాలు ఉంటాయి.. దివ్యాంగులు, వృద్ధులకు కూడా ఈ సమయంలో ప్రత్యేక దర్శనాలు ఉంటాయన్నారు. ప్రొటోకాల్ ఉన్న ప్రముఖులకు తప్ప ఇతరులెవరికీ ఈసారి అంతరాలయ దర్శనాలు లేవన్నారు. బంగారు వాకిలి దర్శన అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉచిత, రూ.100, రూ.300 దర్శనాలే ఉంటాయని. రూ.500 టికెట్లను దసరాలో రద్దు చేశామన్నారు. ఉత్సవాల్లో కీలకమైన మూలానక్షత్రం, విజయదశమి రోజుల్లో అన్ని క్యూలైన్లూ ఉచితం చేసి.. భక్తుల కోసం 22 గంటలు నిరంతరాయంగా దర్శనాలు కల్పిస్తామన్నారు.
కొత్త యాగశాల, ఆర్జిత సేవలకు పూజా మందిరాలు సిద్ధమయ్యాయి. సెంట్రల్ రిసెప్షన్ నిర్మాణం కూడా పూర్తయింది. దీంతో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పుతాయని దేవస్థానం అధికారులు తెలిపారు. కార్తీక మాసంలో నిత్యం చండీయాగం, రుద్రహోమం, సరస్వతీ, గణపతి యాగాలు చేస్తారు. ప్రస్తుతం ఉన్న యాగశాల చిన్నదిగా ఉంది. పౌర్ణమి, పర్వదినాల్లో భక్తులు చండీయాగం చూడటానికి ఇబ్బంది పడేవారు. అందుకే కొత్త యాగశాలను నిర్మించారు. దాత సంకా నరసింహారావు మల్లేశ్వరాలయ విస్తరణ పూర్తి చేసిన తర్వాత యాగశాల నిర్మాణానికి సహాయం చేశారు.
దేవస్థానం అధికారులు రూ.4 కోట్లతో పూజా మందిరాలను నిర్మించారు. వీటిని ఆర్జిత సేవల కోసం శాశ్వత ప్రాతిపదికన అందుబాటులోకి తెచ్చారు. భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ రిసెప్షన్‌లో భక్తులకు ఇబ్బంది లేకుండా ఆర్జిత సేవలు, విరాళాలు, దర్శనం టికెట్లు, ఇతర సేవలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. భక్తులకు అన్ని సేవలు ఒకే చోట లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.