వాళ్లకు 300 గజాల ఇంటి స్థలం, రూ.కోటి నగదు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Telangana Thalli Statue Inauguration: ప్రజా పాలన.. ప్రజా విజయోత్సవాల ముగింపు వేడుకల సందర్భంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం.
సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక ప్రకటన చేశారు. సచివాలయంలో నేడు (డిసెంబర్ 09న) రాత్రి సమయంలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆ తర్వాత నిర్వహించిన సభలో ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ తల్లి ప్రతిరూపమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ వేడుకలను అధికారికంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లో తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను మార్చినా.. ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు.
భూలోకంలో ఏ ప్రాంతానికైనా, ఎవరికైనా తల్లితోనే గుర్తింపు ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నప్పుడు తన తల్లి ఎలా ఉందో.. ఇపుడు కూడా తెలంగాణ తల్లి అలానే ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతిపై దాడి చేయడమే కాదు… అవమానించారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఒక వ్యక్తి, ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచించి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టారని దుయ్యాబట్టారు. ప్రజా ప్రభుత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని తమ సహచర మంత్రులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా గత పాలకులు వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని నిర్ణయించారని.. అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే టీజీని అధికారికంగా వాహనాలకు ఏర్పాటు చేసేలా అమలులోకి తీసుకొచ్చామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉద్యమ సమయంలో స్ఫూర్తిని నింపిన జయ జయహే తెలంగాణ గీతాన్ని పదేళ్లుగా రాష్ట్ర గీతంగా ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వంలో జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించుకున్నామన్నారు.