రేషన్‌కార్డుల జారీలో అయోమయం

కొత్త రేషన్ కార్డులు అందని ద్రాక్షలా మారాయి. ఏడాది క్రితం కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంలో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నది. ఏడాదిలో రెండుసార్లు జరిగిన ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోగా, మళ్ళీ మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.
కొత్త రేషన్ కార్డులు అందని ద్రాక్షలా మారాయి. ఏడాది క్రితం కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కొత్త రేషన్ కార్డులను జారీ చేయడంలో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నది. ఏడాదిలో రెండుసార్లు జరిగిన ప్రజాపాలన గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోగా, మళ్ళీ మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనడంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. గత ఏడాది ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కాదని కులగుణన సర్వే ద్వారా రేషన్ కార్డులు లేని వారి జాబితా ఆధారంగా అర్హతలపై సర్వే చేయడం ఆందోళనకు గురి చేసింది.
రేషన్ కార్డుల్లో పేర్లు లేక ప్రజల ఇబ్బందులు
జనవరి 26వ తేదీకి ముందు నిర్వహించిన గ్రామసభల్లో రేషన్ కార్డుల జాబితాల్లో పేర్లు లేక అనేక మంది ఆందోళనకు గుర య్యారు. ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్డులు ఇవ్వని కారణంగా అర్హులైన వారు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులను జారీ చేస్తామని, ఆరు గ్యారంటీ పథకాలతోపాటు ఇతర పథకాలను అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి పట్టం గట్టారు. గత ప్రభుత్వ హయాంలో అనేక మంది అర్హులైన వారికి రేషన్ కార్డులు రాక చాలా ఇబ్బందులు పడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులను జారీ చేయలేదు. ప్రజల నుంచి తీవ్రంగా వచ్చిన ఒత్తిళ్లతో 2021లో ఒకసారి కార్డులను జారీ చేసి ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రక్రియను నిలిపివేసింది. రేషన్ కార్డులు లేని కారణంగా అనేక కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు నోచుకోక నష్టపోయారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 26 నుంచి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించిన ప్రజాపాలన పట్టణ, గ్రామ సభల ద్వారా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహజ్యోతి, మహాలక్ష్మి, సబ్సిడీ గ్యాస్, తదితర ఐదు గ్యారంటీ పథకాలకు ఒకే ఫారంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ పథకాలు దక్కాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. రేషన్ కార్డు లేని వాళ్లు తెల్లకాగితంపై దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 15,432 దరఖాస్తులు వచ్చాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక దరఖాస్తులు వచ్చాయి. ప్రజాపాలన దరఖాస్తులను ఆన్‌లైన్ చేసిన ప్రభుత్వం రేషన్ కార్డుల దరఖాస్తులను ఆన్‌లైన్ చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన సాఫ్ట్‌వేర్ ద్వారా మీ సేవా కేంద్రాల్లో చేసుకున్న దరఖాస్తులను పట్టించు కోలేదు. అలాగే చేర్పులు, మార్పుల కోసం వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించ లేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని అర్హత గల వారికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుండగా, రూ.500కే వంట గ్యాస్ అందజేస్తున్నారు. రేషన్ కార్డులు లేని వాళ్లకు ఇప్పటి వరకు కూడా ఈ పథకాలు వర్తించ లేదు. ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నా రేషన్ కార్డు లేదనే కారణంగా వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. ఏడాది తర్వాత జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం ఆరంభించింది. రేషన్ కార్డుల విషయంలో ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోకుండా కులగణన సర్వేలో రేషన్ కార్డులు లేవని పేర్కొన్న వారి జాబితా లను ప్రభుత్వం తయారు చేసింది. ఆ దరఖాస్తుల ఆధారంగా జనవరి 26కు ముందు రెవెన్యూ అధికారులు గ్రామాల్లో సర్వే చేయించారు. సర్వే సందర్భంగా చాలా మంది పేర్లు రాకపోవ డంతో ఆందోళన వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల గురించి ఆందోళన వద్దని, గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 12,572 కుటుంబాలు కొత్త కార్డులకు అర్హులని అధికారులు గ్రామసభల్లో ప్రకటించారు. అందులో అర్హత లేని పేర్లు ఉన్నాయని, అర్హత ఉన్న వారి పేర్లు గల్లంతు కావడంతో ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారు. ఆ మేరకు జిల్లాలో 25,435 దరఖాస్తులు వచ్చాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.
జనవరి 26వ తేదీన మండలానికి ఒక గ్రామంలో కార్డులను జారీ చేశారు. గ్రామసభల్లో ప్రకటించిన వాళ్లకు ఇంకా జారీ చేయలేదు. మరల మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించడంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ప్రజా పాలన గ్రామసభల్లో రెండుసార్లు దరఖాస్తు చేసుకున్నా, అంతకు ముందు మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకున్నా రేషన్ కార్డు రాలేదని మొత్తుకుంటున్నారు. గ్రామసభల్లో ప్రకటించిన వారికి రేషన్ కార్డులు ఇస్తారా, లేదా అనే విషయమై స్పష్టత లేదు. మండలానికి ఒక్కో గ్రామంలో రేషన్ కార్డులు ఇచ్చిన వారికి ఫిబ్రవరిలో బియ్యం కోటా విడుదల చేయలేదు. ఇప్పుడు మీ సేవా కేంద్రాల ద్వారా కొత్తగా దరఖాస్తులు చేసుకోవచ్చని, చేర్పులు, మార్పులకు అవకాశం ఇచ్చామని ప్రభుత్వం పేర్కొంది. దీంతో గతంలో దరఖాస్తు చేసుకున్న వాళ్లు, గ్రామసభల్లో పేర్లు వచ్చిన వాళ్లు కూడా మీ సేవా కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. ప్రభుత్వం రేషన్ కార్డుల విషయమై పూటకో తీరుగా వ్యవహరిస్తుండడంతో అర్హులైన వాళ్లు ఆందోళన చెందుతున్నారు. ఈ గందరగోళ పరిస్థితి ఎందుకని, మీ సేవా కేంద్రాల ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని ఏడాది కిందటే చెబితే తద్వారానే దరఖాస్తు చేసుకునే వారిమని, వాటిని పరిశీలించి అర్హులకు కార్డులను మంజూరు చేయడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అర్హులైన వారం దరికీ రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.