రెండు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం- ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి

 రెండు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం- ఈ తప్పులు పొరపాటున కూడా చేయకండి

రెండు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం ఇది. ఈ సమయంలో పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.

న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్
అని కార్తీకమాసం గురించి స్కంద పురాణంలో పేర్కొన్నారు. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, విష్ణుమూర్తికి సమానమైన దేవుడు లేడు. వేదాలతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం ఈ లోకంలోనే లేదని అంటారు. శివకేశవులు ఇద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకమాసం.

ఈ ఏడాది నవంబర్ 2 నుంచి కార్తీకమాసం ప్రారంభం కాబోతుంది. శివ భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఈ మాసంలో పరమేశ్వరుడిని ఆరాధిస్తారు.కార్తీకమాసం అంతా ఏ ఇల్లు చూసినా ధూప దీపాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని కనిపిస్తుంది. తెల్లవారుజామున నిద్రలేచి చన్నీటి స్నానం ఆచరించడం ఈ మాసంలో ప్రత్యేకంగా ఆచరించే ఒక సంప్రదాయం.

ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించడం వంటి ఆచారాలను పాటించడం వల్ల జన్మ జన్మల పాపాల నుంచి ప్రక్షాళన కలుగుతుందని భక్తుల విశ్వాసం. మరో రెండు రోజుల్లో కార్తీకమాసం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ మాసంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటివి చేయకూడదో తెలుసుకుందాం. పండితులు సూచించిన దాని ప్రకారం ముఖ్యంగా ఆరు పనులు పొరపాటున కూడా చేయకూడదు. అవి ఏంటో చూద్దాం.

కార్తీకమాసంలో చేయకూడని పనులు
శివుడికి ఎంతో ఇష్టమైన మాసం ఇది. అందువల్ల ఈ మాసంలో పొరపాటున కూడా ఉల్లి, వెల్లుల్లి వంటి పదార్థాలు తీసుకోరాదు. ముఖ్యంగా మాంసాహారం అసలు ముట్టరాదు. నియమ నిష్టలతో పూజలు చేయాలి.కుటుంబం మొత్తం ఈ నెల రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. తామసిక ఆహారాన్ని దూరం పెట్టాలి.మాంసాహారంతో పాటు మద్యం కూడా సేవించరాదు.

దేవుడి మీద భారం వేసి నియమాలు అనుసరించాలి. అలాగే ప్రదోష కాలంలో నిద్రపోరాదు.ఎవరైనా నిద్రపోతుంటే పెద్దలు ఈ సమయంలో పడుకోకూడదని వారిస్తారు. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో సాయంత్రం పూట నిద్రపోకుండా శివార్చన చేయడం ఉత్తమం. భార్యాభర్తలు దూరంగా ఉండాలి. అలాగే నేల మీద నిద్రించడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఆదివారం రోజు కొబ్బరికాయ, ఉసిరి తినకూడదు. సాధారణంగా కార్తీకమాసంలో ఉసిరి దీపం వెలిగించడం చాలా మంచిది. కానీ ఆదివారం ఒక్కరోజు మాత్రం ఉసిరి, కొబ్బరికాయ తినకూడదని పండితులు సూచిస్తున్నారు.

దీప దానం ముఖ్యం
ఈ మాసంలో దీపదానం చేయడం వల్ల నరకలోక ప్రాప్తి నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే తులసి కోట దగ్గర తప్పనిసరిగా ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి. ఈ మాసంలో చేసే దీపారాధనకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైనా తెలిసీ తెలియక చేసిన పాపాలు దీప దానం చేయడం, దీపం వెలిగించడం వల్ల తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *