రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన! ఎప్పుడంటే..?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో భారీ వర్షాలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. వికారాబాద్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ అయ్యాయి. రెండు రోజుల పాటు మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

ప్రధానంగా.. వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రెండు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. భారీ నుంచి అతి భారీ వర్షాలు, మెరుపులు, ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. అదేసమయంలో.. తెలంగాణలోని పది జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక.. ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు పలు జిల్లాల్లో ఎండలు దంచికొడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే.. ఎండలతో అల్లాడిపోతున్న జిల్లాలకు వాతావరణ శాఖ తీపి కబురు వినిపించింది.
ఏపీలో పలు జిల్లాల్లో రెండు రోజులపాటు.. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఇప్పటికే.. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు అయింది. ఇదిలావుంటే.. ఏపీలోని పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ప్రధానంగా.. విజయనగరం, మన్యం, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు జిల్లాల్లో రెండు రోజులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.