మోసానికి షర్ట్, ప్యాంట్ వేస్తే చంద్రబాబు.. జగన్ తీవ్ర విమర్శలు

 మోసానికి షర్ట్, ప్యాంట్ వేస్తే చంద్రబాబు.. జగన్ తీవ్ర విమర్శలు

సీఎం చంద్రబాబుపై.. మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోసానికి ప్యాంట్, షర్ట్ వేస్తే అది చంద్రబాబు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కూటమి సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాట్లాడిన వైఎస్ జగన్.. అందులో అన్నీ అబద్ధాలే ఉన్నాయని విమర్శలు గుప్పించారు. కూటమి సర్కార్ భారీగా పెన్షన్లను రద్దు చేసిందని.. సూపర్ సిక్స్ పథకాల అమల్లో కూడా అంతా మోసమేనని మండిపడ్డారు. అప్పుల విషయంలో అన్నీ అబద్దాలే చెబుతున్నారని ఆరోపించిన జగన్.. కాగ్ లెక్కలు చూస్తే తెలుస్తుందని పేర్కొన్నారు.

YS Jagan

మోసానికి షర్ట్, ప్యాంట్ వేస్తే చంద్రబాబు.. జగన్ తీవ్ర విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి .. కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పని చేయకుండా.. ప్రచారం మాత్రం పీక్‌లో ఉందని తెలిపారు. తాడేపల్లి నివాసంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. బడ్జెట్‌లో అన్నీ అబద్ధాలు, చంద్రబాబు భజన మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. జీడీపీ, జీఎస్‌డీపీపై చంద్రబాబు సర్కార్ తప్పుడు లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లెక్కలు నిజమే అయితే.. ఏపీ ప్రజల తలసరి ఆదాయం పెరగాలి కదా అని ప్రశ్నించారు. తమ హయాంతో పోల్చితే ప్రస్తుతం రాష్ట్ర ఆదాయ పెరుగుదల చాలా తక్కువేనని జగన్ తెలిపారు.

ఇక ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండానే.. అన్నింటినీ అమలు చేసినట్లు చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ జగన్ ఆరోపించారు. కేంద్ర ఆదాయంలో 9.64 శాతం పురోగతి ఉంటే.. ఏపీ ఆదాయంలో పురోగతి 1.97 శాతం మాత్రమేనన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే 23 రాష్ట్రాల దిగువన ఏపీ ఉందని పేర్కొన్నారు. 2024-25లో దేశమంతా 9.8 శాతం వృద్ధిరేటు ఉంటే.. ఏపీ మాత్రం 11.75 శాతంతో అభివృద్ధిలో దూసుకుపోతోందని చంద్రబాబు చెపుతున్నారని.. 2025-26లో ఏపీ 10.75 శాతం ఉంటే.. దేశం మొత్తం 8 శాతమే మాత్రమే ఉందని చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు.

రాష్ట్ర ఆదాయాన్ని చంద్రబాబు పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. టీడీపీ నేతల వ్యవహారం.. దోచుకో, పంచుకో, తినుకో అన్నట్లుగా తయారైందని.. రాష్ట్రానికి ఉన్న వనరులన్నింటినీ దోచేస్తున్నారన్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌ కళ్యాణ్‌లకు ఒక విమానం, ఒక హెలికాఫ్టర్‌లు ఉన్నాయని తెలిపారు. కొలంబో వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూస్తాడని.. ఆ తర్వాత రోజు ఉదయాన్నే విజయవాడ వస్తారని నారా లోకేష్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రైవేట్ విమానంలో కొలంబో వెళ్లి మ్యాచ్ చూశారని.. టీవీలో చూస్తే మ్యాచ్ కనిపించదా.. తాను టీవీలోనే మ్యాచ్ చూశానని చెప్పారు.

రాష్ట్ర అప్పులపై పదే పదే గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఎన్నిసార్లు సాక్ష్యాలు, ఆధారాలు చూపించినా అవే అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల హయాంలో ఎంత అప్పు ఉందనేదానిపై కాగ్ విడుదల చేసిన లెక్కలు చూసినా కనిపిస్తుందని జగన్ తెలిపారు.

2014లో రాష్ట్రం విడిపోయినపుడు ఏపీ అప్పులు రూ.1,47,717 కోట్లు ఉండగా.. 2019లో చంద్రబాబు సర్కార్ దిగిపోయే నాటికి అవి రూ.3,90,247 కోట్లకు చేరుకున్నట్లు జగన్ తెలిపారు. తమ 5 ఏళ్ల హయాంలో రూ.3,31,671 కోట్లు అప్పులు చేశామని.. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత 18 నెలల్లోనే రూ.3,17,448 కోట్లని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.35 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని.. జీతాలు పెంచకుండా వారితో ఆటలు ఆడుతున్నారని విమర్శలు చేశారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *