మా బతుకులు బాగుపడేదెన్నడు..?
పారిశుధ్య పనుల్లో జీపీ కార్మికుల పాత్ర కీలకం.. అయినా వారి బతుకులు మాత్రం దుర్భరం.. చాలీచాలని వేతనాలతో సిబ్బంది సతమతమవుతున్నారు. భవిష్యత్‌లో వేతనం పెరుగుతుందనే కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు గ్రామంలోని డ్రెయినేజీ, వీధులు శుభ్రం చేయడం, ఇంటి పన్నులు, నల్లా పన్నులు వసూలు చేయడం, వీధిలైట్లు, గ్రామ ప్రజలకు నీటిని అందించడం, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, అధికారులు చెప్పిన పనులు చేయడంలో వారు నిత్యం బిజీగా ఉంటారు. అయినప్పటికీ వారికి సమయానికి వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి మూడు నెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే ఇప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మూడు నెలలుగా అందక అవస్థలు
రఘునాథపల్లి, డిసెంబరు 25: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి తే తమ బతుకులు బాగుపడుతాయనుకున్న గ్రామ పం చాయతీ ఉద్యోగుల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగలి అక్కడే’ అన్నట్లుగా తయారైంది. గ్రామాల్లో ఏళ్లతరబడి పని చేస్తున్న జీపీ కార్మికుల బతుకులు అగమ్యగోచరం గా మారాయి.. మూడు నెలలుగా వేతనాలు రావడం లేదని, కొత్తగా రాష్ట్రంలో కొలువుదీరిన ప్రభుత్వమైనా వే తన వెతలు తీర్చి నెలకు కనీస వేతనమైన రూ.19,500 చెల్లించడానికి చర్యలు తీసుకుంటుందా.. అని గంపెడు ఆశతో ఎదురుచూస్తున్నారు.
పెరిగిన పని భారం..
గ్రామ పంచాయతీలలో పని భారం పెరగడంతో జీపీ కార్మికులు సతమతమవుతున్నారు. గ్రామాల్లో జనాభా పెరుగుతున్నా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచకపో వడంతో ఉన్నవారిపైనే పని భారం పెరుగుతోంది. గ్రామ స్థాయిలో నిర్వహించే ఏ కార్యక్ర మం జీపీ ఉద్యోగుల ప్రమేయం లేకుండా చేయడం సాధ్యం కాదు. కార్యదర్శి, సర్పంచ్ నుంచి మొ దలు కలెక్టర్ వరకు అందరూ జీపీ కార్మికులు, ఉద్యోగులపై పని భారం మోపడం అల వాటుగా మారింది. ఇంత వె ట్టి చాకిరీ చేసినా వేతనాల పెంపు విషయంలో మాత్రం తమను పట్టించుకునే వారు ఎవ్వరు లేరని పంచాయతీ ఉద్యో గులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అరకొర వేతనం..
రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖలలో పనిచేసే ఉద్యోగులతో పోల్చుకుంటే.. ఎక్కువ పని చేస్తూ అతి తక్కువ వేతనం పొందేది తామేనని జీపీ ఉద్యోగు లు వాపోతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న నెలకు రూ.9,500 కుటుంబ పోషణకు సరిపోక నానా ఇబ్బందులు పడాల్సి న దుస్థితిని ఎదుర్కొంటున్నామని, అదికూడా నెలనెలా చెల్లించకుండా, విడతలవారీగా చెల్లిస్తున్నారని, అందులో సగానికి పైగా వైద్యఖర్చులకే అవుతున్నాయని బాధ పడుతున్నారు. పిల్లల చదువులు, ఇతరత్రా ఖర్చుల కోసం అప్పులు చేయక తప్పడం లేదని వాపోతు న్నారు.
జిల్లా వ్యాప్తంగా 1,420 మంది సిబ్బంది..
జిల్లాలోని 12 మండలాల్లో మొ త్తం 281 గ్రామ పంచాయతీలు ఉండ గా, వాటిలో 1,420 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 1,138 మంది మల్టీపర్పస్ వర్కర్లు, ఇతర కేటగిరీలలో 282 మంది అపరేటర్లు, స్వీపరు ్ల,ఎలక్ట్రీషియన్లు, బిల్ కలెక్టర్లు, డ్రైవర్లు, కంప్యూటర్ అపరేటర్లు, కారోబార్లు పని చేస్తున్నారు. వీరందరికీ నెలవారి వేతనాలు సక్రమంగా రావడం లేదు..ఎప్పుడు చేతికందుతాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో వీళ్లు కొట్టుమిట్టాడుతున్నారు.
ప్రధాన డిమాండ్లు
కనీస వేతనానికి నోచుకోకుండా ఏళ్ల తరబడిగా వెట్టి చాకిరీ చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో నెంబరు 60 ప్రకారం నెలకు కనీస వేతనం రూ.19,500 చెల్లించాలి. జీవో నెంబరు 51ని రద్దుచేసి ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పించాలి. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేసి కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలి. కారోబార్లకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులగా పదోన్నతులు కల్పించాలి. మరణించిన జీపీ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
వేతనాలు పెంచి ఆదుకోవాలి: ఉమ్మగోని రాజేష్, కారోబార్, మాదారం
ఏళ్లతరబడిగా తాత్కాలిక గ్రామ పంచాయతీ ఉద్యోగిగా పని చేస్తున్నప్పటి కీ సరైన వేతనం లభించకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నా. నెలకు నామ మాత్రంగా లభించే రూ.9,500 వేతనం ఏ మూలకు సరిపోవడం లేదు. కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వమైనా.. మేము పడుతున్న కష్టాలను గుర్తించి కనీస వేతనాలు చెల్లించడానికి సత్వర చర్యలు తీసుకోవాలి.
కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: చెల్లోజు మల్లాచారి, జీపీ ఉద్యోగుల సంఘం జిల్లా అద్యక్షుడు
గ్రామ పంచాయతీల్లో ఏళ్ల తరబడి నుంచి పని చేస్తున్న కార్మికులకు జీవో నంబర్ 60 ప్రకారం నెలకు రూ.19,500 కనీస వేతనం చెల్లించడానికి కొత్త రాష్ట్ర ప్రభుత్వమైనా సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతీ జీపీ కార్మికుడికి ఇన్సూరెన్స్, ఈస్‌ఐ సౌకర్యంతో పాటు కారోబార్‌లుగా పని చేస్తున్న వారికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలి. జీపీలలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలి…