మార్కెట్లో రూ.29కే భారత్ రైస్; విక్రయించనున్న ప్రభుత్వం
Bharat Rice: నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ ద్వారా 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ లలో భారత్ రైస్ ను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి దశలో రిటైల్ మార్కెట్లో అమ్మకానికి 500,000 టన్నుల భారత్ రైస్ ను ప్రభుత్వం కేటాయించింది
రూ. 29 కే కేజీ బియ్యం..
‘‘వివిధ రకాలపై ఎగుమతి ఆంక్షలు ఉన్నప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే, బియ్యం రిటైల్ ధరలు 13.8%, హోల్సేల్ ధరలు 15.7% పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ ధోరణులను నియంత్రించడానికి, సబ్సిడీలో ‘భారత్ రైస్’ ను వచ్చే వారం నుండి రిటైల్ మార్కెట్లో కిలోకు 29 రూపాయలకు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది” అని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.
5, 10 కిలోల ప్యాక్స్
నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్సిసిఎఫ్), రిటైల్ చైన్ కేంద్రీయ భండార్ ద్వారా భారత్ రైస్ ను 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ లలో విక్రయించనున్నారు. మొదటి దశలో రిటైల్ మార్కెట్లో విక్రయించడానికి ప్రభుత్వం 500,000 టన్నుల ‘భారత్ రైస్’ బ్రాండ్ బియ్యాన్ని కేటాయించింది. ఇప్పటికే సబ్సీడీకి భారత్ అట్టా ను కిలో రూ.27.50, భారత్ పప్పు (శనగ)ను రూ.60కి ప్రభుత్వం విక్రయిస్తోంది.