మహిళలకు ఫ్రీ బస్ జర్నీ.. ప్రతిరోజూ రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్ల జారీ

 మహిళలకు ఫ్రీ బస్ జర్నీ.. ప్రతిరోజూ రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్ల జారీ

మహలక్ష్మీ పథకం కింద ప్రతిరోజు దాదాపు 27 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రోజూ రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు.

ప్రధానాంశాలు:

  • మహిళలకు ఫ్రీ బస్ జర్నీ
  • రోజూ 27 లక్షల మంది ప్రయాణం
  • రూ. 10 కోట్ల విలువైన టికెట్లు జారీ
తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 9 నుంచి ఈ పథకం ప్రారంభం కాగా.. మహిళలు రాష్ట్రంలో ఎక్కిడి నుంచి ఎక్కడికైనా జీరో టికెట్ తీసుకొని బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఈ పథకం అమలు తీరుతెన్నులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సెక్రటేరియట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంస్థ ఉన్నతాధికారులు మంత్రులకు వివరించారు.

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బంది, అధికారులను డిప్యూటీ సీఎం భట్టి అభినందించారు. ఈ స్కీం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని చెప్పారు. ఈ పథకాన్ని ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. టీఎస్ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. నిర్వహణ వ్యయం మేరకు కావాల్సిన నిధులను సంస్థకు సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.

సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్ మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన సంస్థ దృష్టి పెట్టి.. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లను మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. రోజు వారీ నిర్వహణకు అవసమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

ఆర్టీసీ ప్రజల సంస్థ అని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సంస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని, టికెట్ ఆదాయంపైనే కాకుండా.. లాజిస్టిక్స్, కమర్షియల్, తదితర టికేటేతర ఆదాయంపైనా సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *