బస్సులో పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. పిల్లల్ని పక్కన ఎత్తేసి, బట్టలు చినిగిపోయేలా..!
గతంలో వాటర్ ట్యాంకర్ల దగ్గర నీళ్ల కోసం బిందెలతో, జుట్లు పట్టుకుని కొట్టుకోవటం చూసేవాళ్లం. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం పథకం పుణ్యాన.. అలాంటి సీన్లే మళ్లీ చూసే భాగ్యం కలుగుతోంది. రోజూ ఏదో ఓ బస్సులో సీట్ల కోసం మహిళలు జుట్లూ జుట్లు పట్టుకుని కొట్టుకోవటం సర్వసాధారణంగా మారింది. అయితే.. తాజాగా జహీరాబాద్ బస్సులో జరిగిన కుస్తీ మాత్రం డబ్ల్యూడబ్ల్యూఈకి ఏమాత్రం తగ్గలేదండోయ్. పిల్లల్ని పక్కన పడేసి.. వాళ్లు ఏడుస్తున్నా, జుట్లు చెరిగిపోతున్నా.. బట్టలు చిరిగిపోతున్నా.. తగ్గేదేలే అంటూ పొట్టుపొట్టు కొట్టుకున్నారు మన వీరనారీమణులు.
ఇప్పటికే.. భద్రాచలం, వరంగల్ బస్సుల్లో మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఇప్పుడు తాజాగా.. వాటికి మించి మరో కుస్తీ పోటీ జరిగింది. ఈసారి ఇద్దరి మధ్య కాదండోయ్.. నలుగురి మధ్య కుస్తీ. ఇదైతే.. డబ్ల్యూడబ్యూఈకి ఏమాత్రం తగ్గలేదంటే నమ్మండి. జహీరాబాద్ నుంచి సంగారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సులో నలుగురు మహిళలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. సీటు విషయంలో ఇరు కుటుంబాలకు మధ్య మాటామాటా పెరిగి బూతులు తిట్టుకున్నారు. ఇంకేముంది.. కోపం పట్టలేక తర్వాతి ఘట్టమైన సిగపట్లకు దిగిపోయారు. తమ వ్యక్తులకు చెందిన ఇద్దరు కొట్టుకోవటం చూసి.. వాళ్లకు చెందిన మరో ఇద్దరు కూడా కుస్తీకి దిగారు.
ఇందులో ఓ చంటి పిల్ల తల్లి కూడా ఉండటం గమనార్హం. ఒళ్లో ఉన్న పిల్లాన్ని పక్కన ఎత్తేసి మరి కుస్తీకి దిగింది ఆ తల్లి. అటు ఇద్దరు జుట్లు పట్టుకుని కొట్టుకుంటే.. ఇంకో ఇద్దరు కూడా ఓ రేంజ్‌లో కొట్టుకున్నారు. చంటి పిల్ల తల్లి అయితే.. తన ముందున్న మహిళపై విరుచుకుపడగా.. ముందున్న మహిళ కూడా ఎక్కడా తగ్గకుండా వెనక్కి తిరిగి తనకు పట్టు దొరికిన డ్రెస్‌ను పట్టుకుని లాగుతూ ప్రతిదాడి చేసింది. అయితే.. ఈక్రమంలో డ్రెస్ చినిగిపోగా.. ఆమె మాత్రం పట్టు వదల్లేదు. చేతిని కొరికినా ఆమె మాత్రం పట్టు వదల్లేదు. జుట్లు చెరిగిపోయినా, బట్టులు చిరిగిపోయినా.. ఇష్టమున్నట్టు బూతులు తిట్టుకుంటూ కొట్టుకోవటం చూసి.. బస్సులో ఉన్నవాళ్లంతా ముక్కున వేలేసుకున్నారు.
ఓవైపు తమ పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్నా.. పక్కవాళ్లు ఇదేంటని వారిస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా తమ బలాలు ప్రదర్శించారు ఆ వీరనారులు. ఈ తతంగాన్ని మొత్తాన్ని బస్సులో ఉన్నవాళ్లు వీడియో తీయగా.. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కూర్చునే సీటు కోసం.. చుట్టూ జనాలంతా చూస్తున్నారని ఏమాత్రం లేకుండా.. పిల్లలు ఏడుస్తున్నా, బట్టలు చినిగిపోతున్నా పట్టించుకోకుండా ఇంతలా గొడవ పడటం అవసరమా. సీట్లు దొరకకపోతే.. ఎలాగూ ఫ్రీనే కాబట్టి ఇంకో బస్సులో అయినా వెళ్లొచ్చు. అలా కాదు.. ఇంకో బస్సు వచ్చే సరికి లేటవుతుంది వెయిట్ చేసే ఓపిన లేదనుకుంటే.. సర్దుకుని వెళ్లొచ్చు. నిలబడటం కష్టంగా ఉంటే.. పక్కవారిని కొంచెం రిక్వెస్ట్ చేసి కూర్చోవచ్చు. ఎందుకంటే.. అక్కడ కూర్చుంటుంది, నిలబడుతుంది కూడా ఆడవాళ్లే.. పాపం మగవాళ్లకు అసలు ఛాన్సే ఇవ్వట్లేదు కదా. అలాకాదు.. మేమంటే మేము సీటు ఆపుకున్నాం.. ఆ సీట్లో మేమే కూర్చొని వెళ్తామంటూ.. ఇలా గొడవపడటం వల్ల అందరిలో నవ్వులపాలు కావటం తప్ప వచ్చేదేముంటుంది. ఒక్క నిమిషం ఆలోచించండి మహాలక్ష్ములూ..!!