బనకచర్లపై కేంద్రం కీలక చర్య.. త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ..

మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చట్ట వ్యతిరేకమని అభివర్ణించారు. కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌కు ఢిల్లీలో అభ్యంతరాలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల ఆందోళనలు పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా రావాలని కోరారు. ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ అనుసంధానంపై చర్చకు సిద్ధమన్నారు. ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి పాటిల్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు, మూసీ పునరుజ్జీవానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు చట్ట వ్యతిరేకమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజలు, రైతుల ఆందోళనలను కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌కు ఢిల్లీలో వివరించిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తమ అభ్యంతరాలను కేంద్ర మంత్రి పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారని.. ఇది తెలంగాణ నదీ జలాల హక్కుల పరిరక్షణకు ఒక ముఖ్యమైన అడుగు అని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) 1980 అవార్డు, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 నిబంధనలను ఉల్లంఘిస్తుందని తెలంగాణ ప్రభుత్వం బలంగా వాదిస్తోంది.
బనకచర్ల ప్రాజెక్టు గోదావరి జలాలను పోలవరం నుంచి రాయలసీమకు తరలించే లక్ష్యంతో ఉంది. ఇది తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటి వినియోగానికి ఆటంకం కలిగిస్తుందని తెలంగాణ వాదన. ఈ చర్య గోదావరి నది దిగువ ప్రాంతాలైన భద్రాచలం వంటి వాటిలో వరదల ప్రమాదాన్ని పెంచుతుందని, తద్వారా భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టులు చేపట్టే ముందు నదీ జలాల పంపకంపై స్పష్టమైన అవగాహన, ట్రైబ్యునల్ అవార్డుల ఆధారంగా అనుమతులు ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది
ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ సందర్భంగా కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కేంద్రాన్ని కోరారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదాన్ని పరిష్కరిస్తుంది. అంతేకాకుండా… ఇచ్చంపల్లి-నాగార్జునసాగర్ లింక్ ద్వారా పెన్నా బేసిన్‌కు నీటిని తీసుకెళ్లవచ్చని.. ఇచ్చంపల్లి-సాగర్ అనుసంధాన అంశంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఇది కేవలం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడమే కాకుండా.. నదీ జలాల వినియోగంపై తెలంగాణకు ఉన్న దీర్ఘకాలిక వ్యూహాన్ని తెలియజేస్తుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని త్వరలో ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి పాటిల్ హామీ ఇచ్చారని మంత్రి తెలియజేశారు.
కేంద్రం నుంచి పెండింగ్ అనుమతులు..
తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఇంకా అనుమతులు లభించలేదని.. అయితే ఏపీ ప్రాజెక్టులకే త్వరగా అనుమతులిస్తున్నారని ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇది తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందనే భావనను రాష్ట్రంలో పెంచుతోంది. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని,
సమ్మక్క సారక్క, తుమ్మడిహట్టి వంటి వాటికి నీటి కేటాయింపులు చేయాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.