పార్లమెంటులో రెండు ఖాయమేనా ?
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయించేందుకు తెలంగాణా పీసీసీ తీర్మానించింది. బీసీల జనాభా రీత్యా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను మూడు సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేసినట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి తెలిపారు.
బీసీలకు వీలైనన్ని సీట్లు కేటాయించటంలో పార్టీకి మేలు జరుగుతుందని పార్టీ నాయకత్వం నమ్ముతున్నట్లు మల్లు చెప్పారు. అయితే బీసీ నేతలు డిమాండ్ చేసినట్లుగా మూడు సీట్లు కాకుండా రెండింటికి పరిమితం చేయాలని పార్టీ తీర్మానంచేసిందన్నారు.
బీసీ నేతల సమాచారం ప్రకారం బీసీల జనాభా చాలా ఎక్కువగా ఉంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో బీసీలు సుమారు 60 నియోజకవర్గాల్లో మెజారిటిగా ఉన్నారట. అంటే పార్టీల గెలుపోటములను బీసీ జనాభానే నిర్ణయించేంత స్ధాయిలో ఉన్నారని అనుకుంటున్నారు.
ఎలాగూ 60 నియోజకవర్గాల్లో బీసీల జనాభానే ఎక్కువగా ఉంది కాబట్టి జనాభా దామాషా ప్రకారం టికెట్లు కేటాయించాలనే డిమాండ్లు మొదలయ్యాయి.
బీసీ నేతలు డిమాండ్ చేసిన ప్రకారమైతే తక్కువలో తక్కువ 45 నియోజకవర్గాలు బీసీలకు కేటాయించాలి. అయితే పీసీసీ నిర్ణయించిన ప్రకారం చూస్తే మ్యాగ్జిమమ్ 34 నియోజకవర్గాలు కేటాయించే అవకాశముంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను రెండు అసెంబ్లీలని తీర్మానంచేశారు.
అంటే 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో తలా రెండు తీసుకుంటే 34 నియోజకవర్గాలవుతాయి. బీసీ నేతలు చేసిన డిమాండ్ కు పీసీసీ తీర్మానానికి మద్య ఉన్న గ్యాప్ 11 అసెంబ్లీ నియోజకవర్గాలే.
అయితే పీసీసీ తీర్మానం చేసినట్లుగా 34 అసెంబ్లీ నియోజకవర్గాలను ఇవ్వగలదా ? అంత అవకాశం ఉందా అన్నదే డౌటనుమానం. 119 నియోజకవర్గాల్లో 34 నియోజకవర్గాలను బీసీలకు కేటాయించటమంటే మామూలు విషయంకాదు. మొత్తం సీట్లలో నాలుగో వంతుకు మించి కేటాయించబోతున్నట్లు లెక్క.
ఇదే జరిగితే బీసీల మద్దతు కాంగ్రెస్ కు దొరికే అవకాశాలు ఎక్కువగానే ఉందని అనుకోవాలి. మరిదే సమయంలో బీఆర్ఎస్, బీజేపీలు ఏమిచేస్తాయనేది చూడాలి. ఎందుకంటే అన్నీ పార్టీలు బీసీల ఓట్లకే గాలమేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. చూద్దాం పీసీసీ తీర్మానం ఎంతవరకు ఆచరణలోకి వస్తుందో.