పవిత్ర మాసం.. ఉపవాసం కోసం!

ఇస్లామిక్ కాలదర్శినిలో ముహర్రమ్ మొదటి నెల. ఖురాన్లో పేర్కొన్న నాలుగు పవిత్ర నెలల్లో ఇదీ ఒకటి. ముహర్రమ్ నెలవంక దర్శనంతో ఇస్లామిక్ నూతన సంవత్సరం మొదలవుతుంది. ఇది అల్లాహ్ నెలగా ప్రసిద్ధి చెందింది. ముహర్రమ్ అంటే నిషిద్ధం, పవిత్రత, మహోన్నతనం అనే అర్థాలున్నాయి. ఈ నెల గొప్పదనాన్ని అల్లాహ్ ఖురాన్లో గొప్పగా వర్ణించాడు. ‘రమజాన్ నెల తరువాత ముహర్రమ్ నెల ఉపవాసాలు ప్రముఖమైనవి. రమజాన్ తర్వాత ఉపవాసాలు పాటించాలని భావించేవారికి ముహర్రమ్ సరైన మాసం. ఇది అల్లాహ్ నెల. ఆషూరా రోజు ఉపవాసానికి ఎంతో విశిష్టత ఉంది’ అని మహాప్రవక్త ఈ నెల ఔన్నత్యాన్ని పేర్కొన్నారు. ముహర్రమ్ నెలలో పదో రోజును యౌమె ఆషూరా అంటారు.
ఆనాడు ఉపవాసం చేస్తే గతేడాది చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని స్వయంగా ప్రవక్త (స) పేర్కొన్నారు. ఇస్లామిక్ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉన్న ‘యౌమె ఆషూరా’ నాడే హజ్రత్ ఇమామె హుసేన్ (రజి) అమరులయ్యారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన పరివారమంతా వీరోచితంగా పోరాడింది అసువులు బాసింది ఇదే రోజు. అందుకే ఆ సందర్భంగా ముస్లింలు ఇమామె హుసేన్ (రజి) త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటారు. వందల ఏండ్ల కిందట ధర్మం కోసం ఇమామె హుసేన్ ‘కర్బలా’ మైదానంలో చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. నూతన సంవత్సరాన్ని పవిత్ర ఉపవాసాలతో ప్రారంభించి, కొత్త పుణ్యాలతో మంచి కాలానికి స్వాగతం పలుకుదాం.