నేడు శ్రీకాకుళంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించనున్న సీఎంచంద్రబాబు

 నేడు శ్రీకాకుళంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించనున్న సీఎంచంద్రబాబు

ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్‌ పథకాన్ని నేడు శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఏడాదికి మూడు సిలిండర్లు అందించే పథకాన్ని ఇచ్చాపురంలోని ఈదుపురం గ్రామంలో ప్రారంభిస్తారు.

ఏపీలో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్‌ పథకం పంపిణీకి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. టీడీపీ ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

ఉదయం 10గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం 11.35కు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 12.35కు హెలికాఫ్టర్‌లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం, ఈదుపురం గ్రామానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒకటిన్నరకు ఎల్పీజీ సిలిండర్ల డెలివరీ ప్రారంభిస్తారు. లబ్దిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తారు.

అనంతరం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3.20వరకు ఈదుపురం గ్రామస్తులతో ముచ్చటిస్తారు. సాయంత్రం 4.20కు శ్రీకాకుళం ఆర్‌ అండ్ బి గెస్ట్‌ హౌస్‌ చేరుకుంటారు. సాయంత్రం 4.20 నుంచి ఆరున్నర వరకు పార్టీ నేతలకు కేటాయిస్తారు. రాత్రికి శ్రీకాకుళంలోనే బస చేస్తారు.

ఏపీలో దీపావళి కానుకగా సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందచేశారు.

సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. దీపం-2 పథకానికి రాష్ట్రం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 హామీల్లో భాగంగా ఇచ్చిన యేడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేశారు.

ఇందులో భాగంగా ప్రభుత్వం పెట్రోలియం సంస్థలకు చెక్కు అందజేసింది. రూ.2,684 కోట్ల మంజూరుకు అంగీకారం తెలుపుతూ….మొదటి సిలిండర్ కు ఖర్చు అయ్యే రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు ఇప్పటికే అందించింది. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు అందించనుంది. యేడాదికి మూడు విడతల్లో ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది.

అక్టోబర్‌ 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్నిలబ్దిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది. కేంద్రం ఇచ్చే రూ.25ల రాయితీ పోను మిగిలిన రూ.876లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం అమలుకు ప్రతియేటా రూ.2,684 కోట్లు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది.

గ్యాస్ సబ్సిడీ అందుకోవాలంటే…

దీపం-2 పథకంలో భాగంగా ప్రభుత్వ రాయితీ అందుకోవాలంటే లబ్దిదారులు రేషన్‌ కార్డు కలిగి ఉండాలి. లబ్దిదారుల పేరిట గ్యాస్‌ కనెక్షన్ ఉండాలి. ఆధార్‌ కార్డులో ఉన్న పేరుతోనే రేషన్‌ కార్డు, గ్యాస్ కనెక్షన్‌ ఉండాలి. ఈ మూడు వివరాలు సరిపోయిన వారికి ప్రభుత్వం గ్యాస్ రాయితీ చెల్లిస్తుంది.

ప్రత్యక్ష నగదు బదిలీ పథకంలో భాగంగా మొదటి విడతలో గ్యాస్‌ సిలిండర్‌ ఖర్చును లబ్దిదారుల ఖాతాకు డెలివరీ చేసిన 48గంటల్లో జమ చేస్తారు. ఇందుకోసం ఆధార్ డేటా బేస్ వినియోగిస్తారు. ఉచిత గ్యాస్ సిలిండర్‌ పొందడానికి మొదట గ్యాస్‌ కంపెనీలకు లబ్దిదారుడు నగదు నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. సిలిండర్ డెలివరీ అయిన తర్వాత సిలిండర్ ఖర్చును వాపసు చేస్తారు. బ్యాంక్‌ ఖాతాకు లింక్ అయిన ఆధార్‌ పేమెంట్ వ్యవస్థ ద్వారా ఈ నగదు జమ చేస్తారు.

దీపం-2 పథకంలో గ్యాస్ సబ్సిడీని నాలుగు నెలల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. మొదట తీసుకునే సిలిండర్‌కు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే రెండో విడతకు డిబిటి ఇబ్బందులు సవరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్ బిల్లును వినియోగదారుడు మొదటే చెల్లించాలి.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *