నూనె, నెయ్యితో కాదు కేవలం నీళ్లతోనే దీపం వెలిగించే ఆలయం గురించి మీకు తెలుసా?

Water Lamp Temple: మధ్యప్రదేశ్‌లో నీటితోనే దీపం వెలిగించే ఈ ఆలయాన్ని జల్ దీప్ మందిర్ అని పిలుస్తుంటారు. కాలీసింద్ నదీ కిరణాల వెలుతురులో దేదీప్యమానంగా వెలుగులీనే ఈ ఆలయం వెనుక ఎన్నో రహస్యాలున్నాయి.
భారత్ లోని చాలా మందిరాల్లో మనకు తెలియని చాలా రహస్యాలు దాగి వున్నాయి. అవి అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చి అందరినీ అబ్బురపరుస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుని ముక్కున వేలేసుకుని ఔరా అని ఆశ్చర్యపోయే వారు కొందరుంటే, దాని వెనుక నిజం కనుక్కునేందుకు ప్రయత్నించి దేవుని మహిమతో పోటీపడలేక నీరసించిపోయే వారు మరికొందరు. అటువంటిదే ఈ ఆలయ రహస్యం కూడా. మధ్యప్రదేశ్‌లోని శాజాపూర్ జిల్లాలో ఉన్న ఆలయంలో ఘటియాఘాట్ మాతాజీ కొలువై ఉంటారు. ఈ ఆలయ ప్రత్యేకత అనేక ఇతర ఆలయాల్లో వెలిగించినట్లుగా నూనె, నెయ్యిలతో కాకుండా నీటితోనే deepalu వెలిగించగలగడం.
ఈ అద్భుతం గురించి తెలుసుకుని దూరదూరాల నుంచి ఇక్కడకు విచ్చేసిన భక్త జనం ఆశ్చర్యంలో మునిగిపోతుంటారు. ఇంతటి మహిమ ఉన్న ఈ ఆలయ దర్శనానికి ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే అనుమతి ఉంటుంది.
ఈ ఆలయం ఎక్కడ ఉంది?
మధ్యప్రదేశ్‌లోని శాజాపూర్ జిల్లాలో ఉన్న నల్కేడా గ్రామం చేరుకోవాలి. అక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలీసింద్ nadhi కిరణాలు పడే గాడియా గ్రామంలో ఈ ఘటియాఘాట్ మాతాజీ ఆలయం ఉంది.
నీటితో దీపం వెలిగించడం:
కొన్ని సంవత్సరాలుగా నీటితోనే దీపం వెలిగిస్తుంటారు. నెయ్యి లేదా నూనెకు బదులుగా నది నీటినే దీపం వెలిగించడానికి వినియోగిస్తున్నారు. కాలీసింద్ నది నీటిని దీపంలో పోసినప్పుడు అది జిగట ద్రవంగా మారిపోతుందట. ఆ పై దాని ఒత్తిని వెలిగిస్తే దీపం వెలిగిపోతూ ఉంటుందని ఆలయ పూజారులు చెబుతున్నారు. ఈ దీపం వెనుక రహస్యాన్ని చేధించాలని ప్రయత్నించి చాలా మంది విఫలమయ్యారు.
ఈ సంప్రదాయం ఎలా మొదలైందంటే..
చాలా ఏళ్ల క్రితం ఆలయంలోని దీపాలను నూనె లేదా నెయ్యితోనే వెలిగించేవారట. ఒకరోజు అమ్మవారు పూజారికి కలలో కనిపించి నది నీటితో దీపం వెలిగించమని ఆదేశించారట. మరుసటి రోజు ఆ తల్లికి నమస్కరించుకుని విధేయతతో నదీ నీటితో దీపం అంటించగా దేదీప్యమానంగా వెలిగిపోయిందట. అప్పటి నుంచి ఇక అదే సంప్రదాయం కొనసాగుతూ ఉంది.