దేవుని ప్రవక్త!

అప్పట్లో యజమానులు బానిసల పట్ల అతి క్రూరంగా ప్రవర్తించేవారు. ఆ రోజుల్లో కట్టుబానిసగా ఉండేవాడు నీగ్రో జాతికి చెందిన హజ్రత్ బిలాల్ (రజి). ఒకరోజు అతనికి తీవ్ర జ్వరం సోకింది. అంతటి జ్వరంలోనే పొద్దంతా పనిచేసి చీకటి పడ్డాక నడుం వాల్చాడు. అంతలో అటుగా వచ్చిన యజమాని బిలాల్ నిద్రపోవడం చూసి గొడ్డును బాదినట్టు బాదాడు. కనీసం కనికరం చూపకుండా ఒంటిపై ఉన్న కంబళి, దుస్తులను కూడా లాక్కొని పిండి విసరాలని ఆజ్ఞాపించాడు. బిలాల్ చలికి గజగజ వణికిపోతున్నా కనికరించలేదు.
మరో మార్గంలేక నగ్నంగా బార్లీ గింజలను విసుర్రాయిలో వేసి విసరసాగాడు. అదే సమయంలో ముహమ్మద్ ప్రవక్త (సఅసం) అటుగా వచ్చారు. బిలాల్‌ను చూసి ‘ఎందుకు ఏడుస్తున్నావ్? ఏం కష్టమొచ్చింది?’ అని అడిగారు. దానికి బిలాల్ ‘నీ పని నువ్వు చూసుకో. అందరూ అడిగేవారే! సాయానికి ఎవరూ ముందుకు రారు’ అని నిష్టూరమాడాడు. అక్కడినుంచి వెళ్లిపోయిన ప్రవక్త కాసేపటికి ఒక చేతిలో వేడి పాల చెంబు, మరో చేతిలో ఖర్జూరాలు తీసుకొని అక్కడికి వచ్చారు. బిలాల్‌కు వాటినిచ్చి తృప్తిగా పండ్లుతిని, పాలు తాగమన్నారు.
‘పని ఆపితే యజమాని నన్ను చంపేస్తాడు’ అన్నాడు బిలాల్. ‘నీ పని నేను చేస్తాను. నువ్వు తిని విశ్రాంతి తీసుకో’ అన్నారు ప్రవక్త. తెల్లవారేసరికి పిండంతా విసిరి బిలాల్‌కు అప్పజెప్పి వెళ్లిపోయారు ప్రవక్త. ఇలా మూడు రాత్రులు గడిచాయి. మరుసటి రోజు ఉదయం ప్రవక్త వెళ్తుండగా బిలాల్ ఆయన్ను ఆలింగనం చేసుకున్నాడు. ‘సమాజం మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నది. మీపై బురదజల్లుతున్నది. బానిసల పట్ల ఇంతటి దయ చూపే మీరు నిజంగా దేవుని ప్రవక్త అని విశ్వసిస్తున్నాను’ అని ప్రకటించాడు బిలాల్. నాటి నుంచి ప్రవక్త మార్గంలో ప్రయాణిస్తూ తన జీవితాన్ని పునీతం చేసుకున్నాడు.