దేవర తప్పుకుంటే…?

 దేవర తప్పుకుంటే…?

ఈ ఏడాది తెలుగు నుంచి రాబోతున్న అత్యంత భారీ చిత్రాల్లో దేవర ఒకటి. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా కావడం.. జనతా గ్యారేజ్ తర్వాత మళ్లీ అతను కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తుండడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. చిత్ర బృందం ప్రకటించిన ప్రకారం అయితే ఇంకో 70 రోజుల్లోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి. ఏప్రిల్ 5 డేట్‌ను అందుకునే దిశగా చిత్ర బృందం ప్రణాళిక ప్రకారమే అడుగులు వేస్తుండగా.. ఇప్పుడు అనుకోని అవాంతరం ఎదురైంది.

ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు. ఆయనకు అయినవి కొంచెం పెద్ద గాయాలే. ఆసుపత్రిలో అడ్మిట్ కావాల్సిన పరిస్థితి తలెత్తింది. సైఫ్ ఆసుపత్రి పాలైన విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. చిన్న గాయాలైతే ఈ అవసరం పడేది కాదు.

సైఫ్ పాత్రకు సంబంధించి ఇంకా కొన్ని కీలక సన్నివేశాలు తీయాల్సి ఉండగా.. ఆయన కొన్ని వారాల పాటు అందుబాటులోకి రాడని తెలుస్తోంది. దీంతో చివరి షెడ్యూల్ చిత్రీకరణ ఆలస్యం అవుతోంది. టైట్ షెడ్యూల్స్ మధ్య పని చేస్తున్న చిత్ర బృందానికి ఇది పెద్ద షాకే. దీని వల్ల ఏప్రిల్ 5న సినిమాను రిలీజ్ చేయడం దాదాపు అసాధ్యం అని తెలుస్తోంది. ఆ పరిస్థితుల్లో సినిమాను వేసవి చివరికి లేదా ఏడాది ద్వితీయార్ధానికి వాయిదా వేసుకోవడం మినహా మరో మార్గం లేదు.

ఈ విషయమై మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రావచ్చు. దేవర వాయిదా పడేట్లయితే.. సమ్మర్ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో చాలా మార్పులు జరుగుతాయి. ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు దేవర డేట్‌ను గ్రాబ్ చేసుకోవడానికి ప్రయత్నించనున్నాయి. దేవర పాన్ ఇండియా సినిమా కావడంతో వేరే భాషల్లో సినిమాల రిలీజ్ డేట్లలోనూ మార్పులు చోటు చేసుకోవచ్చు.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *