దీపావళికి అమ్మ వారిని పద్మాలతో పూజిస్తే కలిగే ఫలితం ఏంటి?
దీపావళి రోజున లక్ష్మీ దేవిని పద్మాలతో పూజించడం చాలా శ్రేష్టం. ఉత్తమ ఫలితాలను పొందవచ్చని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియామ్ రమామ్ ।
పద్మమాలాధరాం దేవీం పద్మినీ పద్మగంధినీమ్ ॥
అని పద్మవాసిని అయిన శ్రీ మహాలక్ష్మిని నిత్యం స్తోత్రం చేస్తాం. ఆ మహాలక్ష్మి కొలువైన పద్మము అత్యంత విశిష్టమైనది. క్షీరసాగర మథనంలో ముందుగా హాలాహలం పుట్టింది. ఆ తరువాత కామధేనువు, ఉచ్చైతీవం, కల్చతరువు, ఐశ్వర్య దేవత అయిన శ్రీమహాలక్ష్మి ఉద్భవించారు. ఆమె మహావిష్ణువును వరించింది. విష్ణువామెను తన వక్షస్థలంలో దాచుకున్నాడు. అలా పద్మవాసిని అయిన లక్ష్మీదేవి పద్మనాభుని ఇల్లాలు అయిందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
అలాగే సృష్టిలో తొలిపుష్పంగా పద్మాన్ని భావిస్తారు. విష్ణువునాభిలోని పద్మం నుండి పుట్టిన బ్రహ్మ పద్మ సంభవుడయ్యాడు. బ్రహ్మ ఆయుర్దాయంలో మొదటి సగాన్ని పద్మకల్చంగా పురాణాలు చెబుతున్నాయి. కుబేరుని నవనిధులలో పద్మం, మహాపద్మాలను చెబుతారు. నాలుగు దిక్కుల్లోనూ ద్వారాలున్న ఇంటిని పద్మమని పిలుస్తారు. మనకు అష్టాదశపురాణాలలో 50వేల శ్లోకాలతో శ్రీమహావిష్ణువు మాహాత్యాన్ని తెలిపే పద్మపురాణం ప్రసిద్ధం. నీరు ఎక్కడయితే సమృద్ధిగా ఉంటుందో అక్కడ పద్మాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి తామర, పద్మం, పంకజం, నళినం అనే పేర్లు ఉన్నాయి. ఈ పద్మం దేవతలకు ఆసనం. లక్ష్మీదేవి ఎల్లప్పుడు పద్మాసనయై చేతిలో పద్మాలను ధరించి ఉంటుంది.
ఈ పద్మాలు వాడి ఎండిపోయిన తరువాత తామరగింజలు వస్తాయి. ఆ గింజలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అంతేగాక ఆ తామర గింజలను 108 కలిపి దండగా చేసి జపం చేసుకున్నా మంచిదంటారు. ఇంత విశిష్టమైనది పద్మం. ఇక అ పద్మంనందు పద్మావతిగా ఆమహాలక్ష్మియే వెలసిందంటే పద్మం ఎంత పుణ్యం చేసుకుందో కదా! అని చిలకమర్తి తెలియచేశారు.
పూర్వం భరతఖండంలో కాంభోజదేశం అను పేరు గల రాజ్యం ఉందేది. ఆ రాజ్యాన్ని శంఖణుడనే రాజు పాలించేవాడు. కొందరు శత్రువులు శంఖణమహారాజుకు మిత్రులుగా నటిస్తూ మోసంచేత ఆయన రాజ్యాన్చి సంపదలను కైవసం చేసుకున్నారు. రాజ్యాన్ని సంపదలను పోగొట్టుకున్న శంఖణుడు కట్టుబట్టలతో మిగిలాడు. ఆ సమయంలో “స్వామీ! శ్రీమన్నారాయణా! నా భర్తని కాపాడు తండ్రీ. నా పసుపు కుంకుమలు కాపాడు తల్లీ!’’ అని మంగళగౌరిని ప్రార్ధించింది.
ఆ సమయంలో పరమతేజస్సుతో ప్రకాశిస్తున్న ఒక మహనీయుడు వారివద్దకొచ్చి రాజా! ఇక్కడికి దగ్గరలోనే శ్రీమహాలక్ష్మి ఆవిర్భవించిన ఒక దివ్యసరోవరముంది. ఆ సరోవరమంతా పద్మాలు వికసించి ఉంటాయి. అందువల్ల ఆ సరస్సు పద్మసరోవరంగా ప్రసిద్ధిపొందింది. మీ దంపతులిద్దరు ఆ పద్మసరోవరానికి వెళ్ళి స్నానాలు చేసి, భగవంతుని స్తుతించండి. మీ పాపాలు నశించి, మీకు శ్రేయస్సు కలుగుతుంది అని చెబుతాడు. అందుకే పద్మవాసిని అయిన శ్రీమహాలక్షిని నిత్యం స్తోత్రం చేస్తాం. ఆ మహాలక్ష్మి కొలువైన పద్మము అత్యంత విశిష్టమైనది.