తెలంగాణ ఎక్సైజ్ శాఖకు కిక్కే కిక్కు

హైదరాబాద్: తెలంగాణలో మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులు భారీ ఎత్తున పోటీపడ్డారు.
మద్యం షాపులకు సంబంధించిన లైసెన్సులు పొందేందుకు శుక్రవారం తుది గడువు కావడంతో ఇవాళ ఒక్కరోజే
సుమారు 25 వేల మంది దరఖాస్తులు చేశారని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు లక్షా ఏడు వేల
దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, పూర్తి దరఖాస్తులు లెక్కిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 2021వ సంవత్సరంలో 69వేలు
అర్జీలు రావడంతో తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,357 కోట్లు ఆదాయం వచ్చింది. ఈసారి దాదాపు లక్షపైగా
దరఖాస్తులు రావడంతో రూ.2వేల కోట్లు దరఖాస్తుల రుసుం కింద ప్రభుత్వానికి రాబడి వస్తుందని అబ్కారీ శాఖ
అధికారులు అంచనా వేస్తున్నారు.
అబ్కారీ శాఖ గణాంకాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 25వేలు దరఖాస్తులు
వచ్చాయి. ఆగస్టు 4వ తేదీ నుంచి ఇవాళ్టి వరకు 98వేల 959 దరఖాస్తులు వచ్చాయి. కానీ, సాయంత్రం 6 గంటల
వరకు లక్షా ఏడు వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. ఈసారి తెలంగాణ రాష్ట్రంతో పాటు బయటి రాష్ట్రాల
నుంచి కూడా దుకాణాలు దక్కించుకోడానికి భారీ ఎత్తున పోటీ పడ్డారు. గత నాలుగైదు రోజులుగా హైదరాబాద్లో
మకాం వేసిన ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు చెందిన మద్యం వ్యాపారులు… లాభదాయకంగా ఉండే
దుకాణాలు దక్కించుకోడానికి పోటీ పడినట్లు అధికారులు తెలిపారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఢిల్లీ నుంచి పెద్ద సంఖ్యలో వ్యాపారులు అప్లికేషన్స్పెట్టినట్లు తెలుస్తోంది.
ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన ప్రాంతాల విషయానికొస్తే:
సరూర్నగర్: 8,883
శంషాబాద్: 8,749
నల్గొండ: 6,134
మేడ్చల్: 5,210
తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన ప్రాంతాలు:
నిర్మల్: 657
ఆదిలాబాద్: 781
ఆసిఫాబాద్: 846
అధికారిక లెక్కల ప్రకారం రాష్టవ్యాప్తంగా 2వేల 620 దుకాణాలు ఉండగా.. నాలుగో తేదీ నుంచి ఇప్పటి వరకు
పరిశీలిస్తే శంషాబాద్ అబ్కారీ జిల్లా పరిధిలో వంద మద్యం దుకాణాలు ఉండగా వాటిని దక్కించుకోడానికి 8వేల
749 అర్జీలు వచ్చాయి. కాగా, ఆగస్టు 20న డ్రా ద్వారా దుకాణాలను కేటాయించనున్నారు.