డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ మాట్లాడొద్దు జనసేన కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశం పై ఎవరూ మాట్లాడవద్దని ఇటీవల టీడీపీ అధిష్టానం ఆదేశించగా, తాజాగా జనసేన సైతం కీలక ఆదేశాలు జారీ చేసింది.
JanaSena Party Deputy Chief Minister : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం అంశంపై కూటమి పార్టీలైన తెలుగుదేశం(TDP), జనసేన(Janasena) మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ వివాదం ముదిరితే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో పొరపొచ్చలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా కొనసాగుతోంది.. దీంతో ఈ వ్యవహారంలో ముందుగానే అలర్ట్ అయిన టీడీపీ అధిష్టానం.. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరూ.. ఎలాంటి కామెంట్లు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.. కేంద్ర కార్యాలయంనుంచి ఆదేశాలు రావడంతో.. టీడీపీ-జనసేనల మధ్య నడుస్తోన్న సోషల్ మీడియా పోస్టులకు కాస్త బ్రేక్ పడింది.. మరోవైపు.. జనసేన అధిష్టానం కూడా కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఉప ముఖ్యమంత్రి అంశంపై ఎవరూ మాట్లాడొద్దని స్పష్టం చేసింది.. డిప్యూటీ సీఎం విషయంలో మీడియా ముందు గానీ, సోషల్ మీడియాలో గానీ.. ఎవరూ స్పందించవద్దని మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది..
ఈ మేరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ వాట్సాప్ స్టేటస్ గా పెట్టారు.. దీంతో జనసేన పార్టీ వాట్సాప్ గ్రూపుల్లో పార్టీ అధిష్టానం ఆదేశాలు వైరల్‌గా మారాయి.. డిప్యూటీ సీఎం పదవిపై మొదట టీడీపీ నుంచే ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో ఎవరూ మాట్లాడవద్దని పార్టీ శ్రేణులకు టీడీపీ ఆదేశాలు ఇచ్చిన ఒక రోజు తర్వాత జనసేన కూడా స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై జనసేన నుంచి కూడా పలువురు స్పందిస్తుండడంతో ఆ అంశంపై మాట్లాడొద్దని జనసేన ఆదేశించింది. ఇరు పార్టీల నేతలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వ్యవహారంపై పోస్టులు పెడుతున్నారు.. అయితే, అటు టీడీపీ, ఇటు జనసేన ఆదేశాలతో ఇక డిప్యూటీ సీఎం అంశానికి ఫుల్ స్టాప్ పడుతుందా అనే చర్చ కూడా సాగుతోంది..
కాగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా పర్యటనకు వెళ్లిన సమయంలో.. సీఎం పాల్గొన్న సభ వేదిక నుంచే కడప జిల్లా టీడీపీ అధ్యక్షునిగా ఉన్న శ్రీనివాసరెడ్డి.. మంత్రి నారా లోకేష్(Nara Lokesh)ని డిప్యూటీ సీఎం చేయాలనే తన అభిప్రాయాన్ని వెల్లడించారు.. ఇక, ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ మంత్రి సోమిరెడ్డి.. ఇలా పార్టీలో కీలకంగా ఉన్న పలువురు నేతలు కూడా ఇదే డిమాండ్ తెరపైకి తెచ్చారు.. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హీట్ పెంచింది.. అంతేకాదు.. జనసేన పార్టీ నుంచి కూడా కౌంటర్ ఎటాక్ మొదలైంది.. లోకేష్‌ని డిప్యూటీ సీఎంను చేయండి తప్పులేదు.. కానీ, పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది.. తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ మాట్లాడుతూ పవన్ ను ముఖ్యమంత్రి చేయాలని పదేండ్లుగా అనుకుంటున్నామన్నారు. కాగా ఈ చర్చ కూటమిలో కొత్త సమస్యలు తెస్తుందని గ్రహించిన టీడీపీ అధిష్టానం.. ఎవరూ ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్లు చేయొద్దని ఆదేశాలు ఇవ్వగా.. ఇప్పుడు జనసేన కూడా ఎక్కడా దీనిపై మాట్లాడొద్దని స్పష్టం చేసింది..