చెల్లెమ్మకు చెక్.. షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ సంచలన వ్యూహం

 చెల్లెమ్మకు చెక్.. షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ సంచలన వ్యూహం

విమర్శలు, ఆరోపణలతో పంటి కింద రాయిలా మారిన చెల్లి షర్మిలను కంట్రోల్ చేయడానికి జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ కీలక నేతలు YCPలో చేరేలా జగన్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఆయనే స్వయంగా ఆయా నేతలతో చర్చలు జరుపుతున్నట్లు చర్చ సాగుతోంది.

గత ఎన్నికల్లో దారుణ ఓటమితో ఇబ్బందులు పడుతున్న జగన్ ను.. వలసలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి నేతలు టీడీపీ గూటికి చేరిపోయారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు లాంటి వాళ్లు సైతం గుడ్ బై చెప్పారు. ఆళ్ల నాని సైతం ఈ రోజో రేపో సైకిల్ ఎక్కనున్నారు. దీంతో ఎప్పుడు ఏ నేత షాక్ ఇస్తారో తెలియక టెన్షన్ లో ఉన్నారు వైసీపీ అధినేత. ఇదిలా ఉంటే.. చెల్లి షర్మిల సైతం జగన్ కు పంటి కింద రాయిలా మారారు. అధికార కూటమి సర్కార్ తో పాటు అన్న జగన్ పై కూడా నిత్యం విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. ఆస్తుల విషయలతో పాటు వ్యక్తి గత విభేదాలను కూడా పదే పదే ప్రస్తావిస్తూ ఇరుకున పెడుతున్నారు. గత ఎన్నికల్లోనూ షర్మిలతో విభేదాలు జగన్ ను దెబ్బకొట్టాయన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో చెల్లికి షాక్ ఇచ్చేందుకు జగన్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో తన తండ్రితో పాటు పని చేసి కాంగ్రెస్ లోనే కొనసాగుతున్న నేతలపై జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షర్మిలపై అసంతృప్తిగా ఉన్న ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతల లిస్ట్ ను జగన్ తెప్పించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారందరినీ పార్టీలో చేర్చుకునేలా జగన్ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. స్వయంగా జగనే వారితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. నిన్న కర్నూలు జిల్లాలో ఓ వివాహ వేడుకకు వెళ్లిన జగన్ కాంగ్రెస్ సీనియర్ నేత శైలజానాథ్ తో చర్చలు జరిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన శైలజానాథ్ మంత్రిగా కూడా పని చేశారు. వైఎస్సార్ కు సన్నిహితుడిగా కూడా ఉన్నారు.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి పీసీసీ చీఫ్‌ గా కూడా పని చేశారు. షర్మిల ఏపీ పీసీసీ చీఫ్‌ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆమె వైఖరిపై శైలజానాథ్‌ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఆయనతో చర్చలు జరిపి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. మరో వైపు అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ ను కూడా పార్టీలోకి చేర్చుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కాంగ్రెస్ నుంచి రెండు సార్లు అమలాపురం ఎంపీగా విజయం సాధించారు. ఆ ప్రాంతంలో బలమైన నేతగా ఉన్నారు.

ముఖ్యంగా మాల సామాజిక వర్గంలో ఆయనకు పట్టు ఉంది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ కూడా వర్గీకరణకు మద్దతు ఇస్తే తాను పార్టీ వీడేందుకు సిద్ధమని ప్రకటించారు. హర్ష కుమార్ ను చేర్చుకోవడం ద్వారా పార్టీ బలోపేతం కావడం మాత్రమే కాకుండా షర్మిలకు షాక్ ఇవ్వొచ్చన్న భావనలో జగన్ ఉన్నారన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. వీరితో పాటు మరో 8 మంది కాంగ్రెస్ కీలక నేతలపై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. వీరందరినీ ఒకే సారి పార్టీలో చేర్చుకుని కేడర్ లో జోష్ తీసుకురావాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *