చెత్త బండిలో వచ్చి కొత్త పారిశుద్ధ్య కార్మికుడు.. ముఖం చూసి జనం షాక్!

పచ్చదనం, పరిశుభ్రతతోనే ఆరోగ్యమైన జీవనాన్ని సాగించవచ్చు. లేకపోతే అనారోగ్యం మారిన పడడం ఖాయం. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై ప్రభుత్వం ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఎమ్మెల్యే పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఆయన ఇంకేం చేశారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి జిల్లా వాణిజ్య కేంద్రంగా పేరు ఉంది. రైస్ ఇండస్ట్రీస్ కు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న మిర్యాలగూడ పట్టణంలో ఆసియా ఖండంలోనే అత్యధికంగా రైస్ మిల్లులు ఉన్నాయి. పారిశుద్ధ కార్మికులు నిర్లక్ష్యంగా ఉంటే మున్సిపాలిటీలు మురికిపాలిటీలుగా మారుతాయి. పట్టణంలో అక్కడక్కడ చెత్త పేరుకు పోతోందని పట్టణ పౌరులు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కి ఫిర్యాదు చేశారు. పట్టణ పరిశుభ్రతపై దృష్టి సారించిన ఎమ్మెల్యే బిఎల్ఆర్.. ముందుగా ఉదయం 5 గంటలకు నేరుగా వెళ్లి పారిశుద్ధ్య కార్మికుల పనితీరుని పరిశీలించారు.
మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లతో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమావేశమమై సమీక్షించారు. ఎమ్మెల్యే ఖాకీ చొక్కా ధరించి, పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. మున్సిపల్ కార్యాలయం నుంచి నేతాజీ కూరగాయల మార్కెట్, గాంధీనగర్ వరకు చెత్త తరలించే ట్రాలీ ఆటోను నడుపుకుంటూ వెళ్లి చెత్తను సేకరించారు. చెత్త వేసేందుకు వచ్చే మహిళలను పలకరిస్తూ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం వేయరాదని చెప్పారు.