కేసీయార్ ఆయుధాలు పనిచేస్తాయా?

 కేసీయార్ ఆయుధాలు పనిచేస్తాయా?

రాబోయే ఎన్నికల్లో ప్రయోగించేందుకు తన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయని, వాటిని ప్రయోగిస్తే ప్రతిపక్షాలకు దిమ్మతిరగడం ఖాయమని కేసీఆర్ అనుకుంటున్నారు. నిజంగానే కేసీయార్ దగ్గర అంత దమ్మున్న ఆయుధాలున్నాయా ? ఉంటే అవి ఏమిటి ? కేసీయార్ చెప్పినట్లుగా ప్రతిపక్షాలన్నీ ఆయుధాల దెబ్బకు దిమ్మతిరిగిపడిపోతాయా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ ఆయుధాల గురించి చెప్పుకుంటే ముందు ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వడం, ఇతరత్రా సౌకర్యాలు కలగజేయటం.

ఇక రైతులకు రుణమాఫీ పూర్తిగా చేయటం. ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగుల కోపాన్ని చల్లబరచటం లాంటివి ముఖ్యమైనవి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ ప్రభుత్వం మీద జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజంకూడా ఉంది. వ్యతిరేకత అంతలా పెరిగిపోయిన తర్వాత ఎన్ని అస్త్రాలను తీసినా ఉపయోగముండదు. ఎందుకంటే హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కేసీయార్ తన దగ్గరున్న అస్త్రాలన్నీ వాడేశారు. అయినా ఓటమి తప్పలేదు.

నాలుగేళ్ళుగా రుణమాఫీ చేయకపోవటం వల్ల రైతులు నానా యాతనలకు గురవుతున్నారు. అలాంటిది ఎన్నికలకు ముందు రుణమాఫీ చేసేస్తానంటే రైతుల కడపుమంట చల్లారుతుందా ? దాదాపు ఐదేళ్ళు ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా చివరలో పీఆర్సీ వేస్తాను, ఇంటెరిం రిలీఫ్(ఐఆర్) ప్రకటిస్తానంటే కుదురుతుందా ? నాలుగేళ్ళు ఉద్యోగాల భర్తీచేయకుండా చివరలో నోటిఫికేషన్లు జారీచేసి హడావుడి చేస్తే నిరుద్యోగులు ఓట్లేస్తారా ? ఇవికాకుండా కేసీయార్ దగ్గరున్న అస్త్రాలు ఇంకేమున్నయ్.

జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిన తర్వాత ఎన్నివరాలు ప్రకటించినా ఆ మంట చల్లారదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం కూడా అచ్చంగా ఎన్నికల స్టంటని తెలిసిపోతోంది. రేపటి ఎన్నికల్లో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు వ్యతిరకం చేస్తారనే భయం మొదలైంది కాబట్టే సడెన్ గా విలీనమన్నారు. లేకపోతే వీళ్ళగురించి కేసీయార్ ఎన్ని సంవత్సరాలైనా పట్టించుకునే వారు కాదు. ఈ పరిస్ధితుల్లో కేసీయార్ దగ్గరున్న అస్త్రాలు ఏమిటో ? వాటి దెబ్బకు ప్రతిపక్షాలకు దిమ్మతిరిగిపోవటం ఏమిటో తొందరలోనే తెలిసిపోతుంది. ఏమున్నా రాబోయే ఎన్నికల్లో ఎవరి దగ్గర ఎలాంటి అస్త్రాలు ఉన్నాయో తెలిసిపోతుంది కదా.

Digiqole Ad

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *