ఏపీ బీజేపీ చీఫ్ మార్పు.. పురంధేశ్వరి సంచలన కామెంట్స్

ఏపీలో బీజేపీ చీఫ్ మార్పు అంశంపై అగ్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని పురంధేశ్వరి స్పష్టం చేశారు. దీనిపై తాను కామెంట్ చేయలేనన్నారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని అమిత్ షా ఇటీవల తన పర్యటనలో దిశా నిర్దేశం చేశారన్నారు.
ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పు ఉంటుందా? లేదా? అనేది అధిష్టానం నిర్ణయమని ఎంపీ పురంధేశ్వరి (Purandeswari) స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను ఎలాంటి కామెంట్ చేయనన్నారు. RTVతో పురంధేశ్వరి ప్రత్యేకంగా మాట్లాడారు. రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కావాలని అమిత్ షా (Amit Shah) చెప్పారన్నారు. బూత్ లెవల్ నుండి పార్టీని బలోపేతం చేయమని చెప్పారన్నారు. ప్రభుత్వ పాలన, రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై దిశా నిర్దేశం చేశారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు, అమరావతి, పోలవరం నిర్మాణాలకు కేంద్రం సాయం అందించిందన్నారు. రాబోయే రోజుల్లో మరింత సాయం కేంద్రం నుండి రాష్ట్రానికి వస్తుందన్నారు. తిరుమల (Tirumala) లో తొక్కిసలాట ఘటనపై దేశమంతా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందన్నారు. హోం శాఖ దీని మీద ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. దేవాలయాల పరిరక్షణకు ఎన్డీఏ కూటమి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఏపీ బీజేపీ కొత్త చీఫ్ పై చర్చ..
ఏపీకి కొత్త బీజేపీ చీఫ్ ఎవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఏపీ బీజేపీకి సారధిగా ఉన్న పురంధేశ్వరిని మార్చడం ఖాయమైందని తెలుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడు ఎవరనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సీమకు చెందిన వ్యక్తికే అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రామచంద్రా రెడ్డి, ఇసుక సునీల్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. రెడ్డి సామాజిక వర్గానికి అధ్యక్ష పదవి కట్టబెడితే తానూ రేసులో ఉన్నానని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
వీరితో పాటు ఎమ్మెల్యే సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు ఏపీ బీజేపీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి అధక్ష పదవి వస్తే జగన్‌కు చెక్ పెట్టొచ్చనే యోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తాయి. మరో వైపు పురంధేశ్వరిని కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉందన్న ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వచ్చే నెలాఖరు నాటికి కొత్త అధ్యక్షుడు ఎవరనే అంశంపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.