ఏపీలో వాలంటీర్లకు గుడ్‌న్యూస్.. రూ.10వేల గౌరవ వేతనంపై క్లారిటీ, పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ల అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం వాలంటీర్ల పేరుతో యువతను మోసం చేసిందని.. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కురిడి గ్రామంలో పర్యటించిన సమయంలో గతంలో వాలంటీర్లుగా పనిచేసిన మహిళలు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్ చెల్లింపులకు సంబంధించి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేవని.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌ల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. అలాగే గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే ఆలోచనలో ఉన్నామని.. దీనిపై కేబినెట్‌లో చర్చించామని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లకు ఇచ్చిన గౌరవ వేతనం ఏ ఖాతా నుంచి చెల్లించారో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వం వాలంటీర్ల ఉద్యోగాల పేరుతో విద్యావంతులైన యువతను మోసం చేసిందని.. వాలంటీర్లకు జీతాలు ఏ పద్దు నుంచి ఇచ్చారో వైఎస్సార్‌సీపీ నేతల్ని ప్రశ్నించాలని సూచించారు. వాలంటీర్ల నుంచి సాధారణ ప్రజల వరకు అందరినీ త్రిశంకు స్వర్గంలో పెట్టిందని.. అన్ని వ్యవస్థలను నాశనం చేసిందన్నారు. గత ప్రభుత్వం ఏజెన్సీలో వంద కిలోమీటర్ల మేర కూడా రోడ్లు వేయలేదని.. కూటమి ప్రభుత్వం రూ.1000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతోందన్నారు.
అలాగే పలు కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ‘అరకు నియోజకవర్గం, కురుడి గ్రామంలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. గ్రామ అభివృద్ధికి సంబంధించిన అంశాలు, సమస్యలపై గ్రామస్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ అంశంపై మాట్లాడుతూ, వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి అధికారిక జీవోలు ఇవ్వకుండా, ప్రభుత్వ ఉద్యోగాలు అంటూ యువతను మోసం చేశారు, వాలంటీర్ల వ్యవస్థ పేరుతో గత పాలకులు వంచించారన్నారు. వాలంటీర్లకు గతంలో ఇచ్చిన హామీపై క్యాబినెట్ లో పలుమార్లు చర్చించాం కానీ అధికారికంగా నియామకాలు జరపకపోవడం వలన ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉమ్మడి సేంద్రీయ వ్యవసాయం పెరగాలని, కేరళ తరహా పర్యాటకం మన దగ్గర అధికమవ్వాలని దానికి అనుగుణంగా అధికార యంత్రాంగం పనిచేయాలని అధికారులకు సూచించారు’ అని ప్రకటన విడుదల చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా సుంకరమెట్ట దగ్గర అటవీ శాఖ నిర్మించిన వుడెన్ బ్రిడ్జిని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు.కాఫీ తోటలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు సౌకర్యంగా ఉండేలా చెక్క వంతెనను అటవీ శాఖ నిర్మించింది. రిజన గ్రామస్తుల కోరిన మేరకు కురుడి గిరిజన గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించి శివాలయంలో అభిషేకార్చనలు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం సొంత నిధుల నుండి రూ.5 లక్షలతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని గ్రామ సమస్యలపై చర్చించారు.పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, పర్యాటకశాఖ సంయుక్త కార్యాచరణలో గ్రామంలో ప్రకృతి వ్యవసాయం, టూరిజంకి ప్రోత్సాహకాలు కల్పించడం ద్వారా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.