అయోధ్య రామ మందిర ప్రారంభం వేళ.. అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ట్వీట్
దేశమంతా రామనామ స్మరణతో మారుమోగిపోతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే.. ఎక్కడ చూసిన బాల రాముని ఫొటోలే దర్శనమిస్తున్నాయి. కాగా.. ఇలాంటి సమయంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఓ ట్వీట్ చర్చకు తెరలేపింది. “రామ్ కే నామ్” అనే డాక్యుమెంటరీ ప్రదర్శిస్తోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయటంతో.. అసదుద్దీన్ ట్వీట్టర్ వేదికగా పోలీసులకు ప్రశ్నించారు. దీంతో.. అసలు వివాదం చెలరేగింది.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వేళ దేశమంతా దేశమంతా రామ నామం స్మరిస్తోంది. ప్రాణ ప్రతిష్ఠా తర్వాత వజ్రాభరణ అలంకృత బాల రామున్ని కళ్లారా చూసి.. ప్రతి భక్తుడు పులకించిపోతున్నాడు. హిందువుల ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొంది. ఇలాంటి సమయంలో.. ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. హైదరాబాద్ సైనిక్‌పురిలోని ఓ కేఫ్‌లో “రామ్ కే నామ్” అనే డాక్యుమెంటరీని ప్రదర్శించడమే ఈ వివాదానికి కారణంగా మారింది. అయితే.. కేఫ్‌లో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించడాన్ని చూసిన కొందరు.. అది రామ మందిరానికి విరుద్ధంగా ఉందని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. దీంతో.. పోలీసులు వెంటనే స్పందించి.. డాక్యుమెంటరీని ప్రదర్శిస్తోన్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే.. అసదుద్దీన్ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది ఆయనపై వ్యతిరేకంగా కామెంట్లు చేస్తుంటే.. కొందరు సపోర్ట్ కూడా చేస్తూ కామెంట్లు చేశారు. అయితే.. అందులో కొందరు “రజాకర్” సినిమా విషయంలో వ్యవహరించిన తీరును ప్రస్తావిస్తూ.. ఆ సినిమా విషయంలో ఎందుకు నిరసన తెలిపారు అంటూ అసదుద్దీన్‌ను ప్రశ్నిస్తున్నారు. దీంతో.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. ఆదివారం రోజున (జనవరి 21న) కూడా అయోధ్య రామ మందిరంపై అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదును ఓ క్రమ పద్దతిలో స్వాధీనం చేసుకున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. విశ్వ హిందూ పరిషత్ ఏర్పాటు సమయంలో అసలు అక్కడ ఆలయమే లేదంటూ ఆరోపించారు. బాబ్రీ మసీదులో 500 ఏళ్లకుపైగా ముస్లింలు నమాజ్ చేశారని చెప్పుకొచ్చారు అసదుద్దీన్.