అతిపెద్ద సైబర్ కుంభకోణం.. 1,600 కోట్ల పాస్‌వర్డ్‌లు లీక్

ఆన్‌లైన్‌లో ఏకంగా 1,600 కోట్లకుపైగా పాస్‌వర్డ్‌లు లీక్‌గా అయ్యాయని సైబర్‌న్యూస్, ఫోర్బ్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడిందని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
ఆన్‌లైన్‌లో అతిపెద్ద కుంభకోణం బయటపడింది. భారీ డాటా చౌర్యం వెలుగు చూసింది. దీని వల్ల ఏకంగా 1,600 కోట్లకుపైగా పాస్‌వర్డ్‌లు బహిర్గతమయ్యాయి. ఇది ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ లీక్‌గా నిలిచింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడిందని సైబర్‌న్యూస్, ఫోర్బ్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇది విస్తృతమైన ఫిషింగ్ స్కామ్‌లు, ఐటెంటిటీ థెఫ్ట్, ఆన్‌లైన్ ఖాతాల హ్యాకింగ్‌కు దారితీయవచ్చని వారు భావిస్తున్నారు. లీకైన సమాచార వివరాల్లో కొత్తవి, డిటైల్‌గా ఆర్గనైజ్ చేసినవి ఉన్నాయట. ఇన్ఫోస్టీలర్లు అని పిలిచే ఒక రకమైన మాల్‌వేర్ ద్వారా డేటా చోరీ జరిగినట్లు సెక్యూరిటీ పరిశోధకులు చెప్తున్నారు. ఈ మాల్‌వేర్ ప్రోగ్రామ్‌లు ప్రజల డివైజ్‌ల నుంచి సైలెంట్‌గా యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లను దొంగలించి హ్యాకర్లకు పంపుతాయి. ఆ వివరాలను హ్యాకర్లు నేరుగా ఉపయోగిస్తారు. లేదంటే డార్క్ వెబ్ వేదికల్లో అమ్ముకుంటారు.
లీక్ అయిన డాటాలో ఈ-మెయిల్ ఖాతాలు, గూగుల్, ఫేస్‌బుక్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలతోపాటు కొన్ని ప్రభుత్వ పోర్టళ్ల సేవల కోసం వినియోగదారులు ఉపయోగించే లాగిన్ వివరాలు ఉన్నట్టు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లు సులభంగా ఉపయోగించుకోగలిగేలా ఇందులో చాలా సమాచారం వెబ్‌సైట్ లింక్‌తోపాటు యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను చూపించే ఫార్మాట్‌లో ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ఎంతో నిర్మాణాత్మకంగా, వినియోగాత్మకంగా ఉన్న ఈ డాటాని చూసి సైబర్ సెక్యూరిటీ నిపుణులే నివ్వెరపోతున్నారు. ఇది కేవలం డాటా ఉల్లంఘన మాత్రమే కాదని, వరల్డ్ సైబర్ క్రైమ్‌కు బ్లూప్రిట్ అని పేర్కొంటున్నారు. రక్షణ లేని ఓ వెబ్ సర్వర్‌లో 18.4 కోట్ల రికార్డులతో కూడిన ఓ రహస్య డాటా బేస్ ఉన్నట్టు ఇటీవల పలు నివేదికలు వెలువడిన నేపథ్యంలో ఈ భారీ లీకేజీ బయటపడింది. ఇందులో దాదాపు 30 భారీ డాటా సెట్లు ఉన్నాయని, ఒక్కో సెట్‌లో కోట్ల లాగిన్ వివరాలను సేకరించారని, మొత్తంగా 1,600 కోట్లకుపైగా పాస్‌వర్డ్‌లు చోరీకి గురయ్యాయని నిపుణులు భావిస్తున్నారు.