అంబాజీపేట మ్యారేజీ బ్యాండు
ఒక చిన్న సినిమాకు మొదటి రోజు ఆడియన్స్ ని రప్పించడమే పెద్ద సవాల్ గా మారుతున్న తరుణంలో ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేయడం సాహసం. బేబీ లాంటి బ్లాక్ బస్టర్లు దాని వల్లే ప్రయోజనం సాధించినా కొన్నిసార్లు రివర్స్ అయిన దాఖలాలు లేకపోలేదు. కంటెంట్ మీద నమ్మకంతో అంబాజీపేట మ్యారేజీ బ్యాండు బృందం ప్రధాన కేంద్రాల్లో స్పెషల్ షోలు వేసింది. మెల్లగా ఎదుగుతూ జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న సుహాస్ హీరోగా రూపొందిన ఈ విలేజ్ డ్రామా అంచనాలకు తగ్గట్టు ఆకట్టుకునేలా ఉందా
కథ
బ్యాండ్ మేళం వాయించుకునే మల్లి(సుహాస్), స్కూల్ టీచర్ పద్మ(శరణ్య ప్రదీప్) అక్క తమ్ముడు. పెద్ద కులానికి చెందిన లక్ష్మి(శివాని నాగారం)ని మల్లి ప్రేమిస్తాడు. ఆమె అన్నయ్య వెంకట్(నితిన్ ప్రసన్న) ఊళ్ళో అధిక వడ్డీలకు అప్పులిచ్చి అందరినీ పురుగుల కంటే హీనంగా చూస్తాడు. కొన్ని పరిణామాల వల్ల పద్మని దారుణంగా అవమానిస్తాడు వెంకట్. తిరగబడిన మల్లికి అదే జరుగుతుంది. దీంతో ఇద్దరూ ఒక్కటై మూకుమ్మడిగా అతన్ని ఎదురుకోవడానికి సిద్ధపడతాడు. ఈలోగా చెల్లి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న వెంకట్ పగతో రగిలిపోతాడు. మరి ముగ్గురి మధ్య మొదలైన యుద్ధం పల్లె జనంలో ఎలాంటి మార్పుకు దారి తీసిందనేది తెరమీద చూడాలి.